- కోర?స?ల? - స?థూలవీక?షణం
వివిధ రకాల సాంకేతిక, సృజనాత్మక శాఖలకు చెందిన ప్రతిభావంతుల పరస్పర సహకారం, సమిష్టి కృషిపై ఆధారపడిన ప్రయత్నమే చలనచిత్ర నిర్మాణం. ఇక్కడ అద్భుతమైన ఊహాశక్తి కలిగిన వ్యక్తులు, అసమాన సాంకేతిక ప్రావీణ్యం కలిగిన వ్యక్తులు కలిసి సినిమాకు జీవం పోయడానికి తమ నైపుణ్యాలను అందిస్తూ చలన చిత్ర నిర్మాణ కళను సుసంపన్నం చేస్తారు. చలనచిత్ర కళలోని వివిధ విభాగాల్లో ప్రావీణ్యం సంపాదించడం కోసం మీ ప్రయాణాన్ని మాతో మొదలుపెట్టండి.
-
కథ - కథనం
మనమందరం కథలు వింటాం. విన్నదాన్ని పూసగుచ్చినట్టు ఇతరులతో కూడా పంచుకుంటాం. అంతెందుకు! అమ్మమ్మలు చెప్పే కథలు వింటూ గోరుముద్దలు తినడం మనందరికీ ఒక గాఢమైన బాల్యస్మృతి. కథలు మన సంస్కృతిలో ఒక అంతర్భాగంగా ఉన్నాయి. వెండితెరపై సినిమాల్లో మనం చూసేవి కూడా కథలే! కల్పిత పాత్రలు, వారి జీవితాలు, వారి సుఖసంతోషాలు, ఆటుపోట్లు... దాదాపు రెండు గంటల నిడివి ఉన్న సినిమాలో మనల్ని ఆసక్తిగా కట్టిపడేసే అంశాలు ఇవే. ఇదే కథకుల ప్రతిభకు గీటురాయి. సినిమా ఒక చిన్న ఆలోచన నుంచే పుట్టవచ్చు. కానీ విత్తులాంటి ఆ ఆలోచన నుంచి మహావృక్షం లాంటి సినిమాను మొలకెత్తించడం ఒక అద్భుతమైన సృజనాత్మక ప్రక్రియ. ప్రేక్షకులను ఆద్యంతంఆకట్టుకునే విధంగా కథ ఎలా చెప్పాలో, స్క్రీన్‌ప్లే రాసే మెళకువలేమిటో కథ - కథనం మొదలైన అంశాలపై మేము రూపొందించిన ఆన్లైన్ కోర్సులో మీరు నేర్చుకుంటారు.
-
డిజిటల్ ఫిల్మ్ మేకింగ్
భారతదేశ చలనచిత్ర పరిశ్రమది వందేళ్ళ ఘనమైన చరిత్ర. ఈ వంద సంవత్సరాలలో సినిమా నిర్మాణ ప్రక్రియ అనూహ్యమైన సాంకేతిక మార్పులకు గురైంది. సినిమా మాధ్యమం తన 'రీల్’ పరిధిని దాటుకుని డిజిటల్ యుగంలోకి ప్రవేశించింది. ఇంతకుముందు మాన్యువల్‌గా నిర్వహించే చిత్రనిర్మాణ ప్రక్రియలు చాలామటుకు ఇప్పుడు స్వయంచాలకంగా మారాయి. ఎక్కువ సిబ్బంది, ఎక్కువ పనిగంటలు అవసరమయ్యే పాతతరం విధానాలకి స్వస్తి పలికి సినిమా మరింత ప్రొఫెషనల్‌గా మారింది.ఇదంతా ఎలా సాధ్యమైంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే డిజిటల్ ఫిల్మ్ మేకింగ్. అధునాతన పరిశ్రమ-ప్రామాణికమైన పద్ధతులు, సాధనాలు, సాంకేతికతను అందిపుచ్చుకుని నవతరం మెచ్చే సినిమాలు రూపొందించడానికి మేము అందిస్తున్న ఆన్‌లైన్ డిజిటల్ ఫిల్మ్‌మేకింగ్ కోర్స్ ఉపయోగపడుతుంది
-
దర్శకత్వం
కథను వెండితెరపై ప్రతిబింబింపజేయడంలో ప్రతి చలనచిత్రానికీ తనదైన ఒక శైలి ఉంటుంది. ఆ ప్రత్యేకత ఆ చిత్ర దర్శకుడి ఆలోచనావిధానం మీద ఆధారపడి ఉంటుంది. కాగితంపై రాసిన అక్షరాలను అందంగా దృశ్యబద్ధం చేయడం దర్శకుడి బాధ్యత. దర్శకత్వం అనేది సృజనాత్మక నైపుణ్యం, సాంకేతిక ప్రావీణ్యాల మేలుకలయిక. చలనచిత్ర నిర్మాణమనే బృహత్‌ప్రక్రియలో ఎంత చిన్న పనైనా దర్శకుడి కనుసన్నల్లో జరగాల్సిందే. అందుకే మేము అందిస్తున్న డైరెక్షన్ డిజిటల్ కోర్స్ ద్వారా దర్శకత్వంలోని మెళకువలు గ్రహించి ప్రతిభావంతులుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తున్నాం.
-
నటన
నటన అనేది ఊహాత్మక పరిస్థితుల నడుమ మన శరీర కదలికలు, ముఖ కవళికలు, భావోద్వేగాల ద్వారా ఒక కల్పిత పాత్రను వాస్తవికంగా అభినయించే అరుదైన కళ. నటించడమంటే ఇంకొకరి జీవితాన్ని నిజాయితీగా జీవించగలగటమే! నటన మన భావోద్వేగాలను, ఆలోచనలను చిత్తశుద్ధితో ప్రతిబింబిస్తుంది. తళుకుబెళుకుల గ్లామర్, మిడిమిడి ఆకర్షణ మాత్రమే నటనగా చలామణీ అవుతున్న క్రమంలో మా యాక్టింగ్ డిజిటల్ కోర్స్ నటనలోని మెళకువలు నేర్చుకుని నటులుగా మిమ్మల్ని మీరు సానబెట్టుకోవడానికి దోహదపడుతుంది.
-
చలనచిత్ర నిర్మాణం
క్రమబద్ధమైన నిర్మాణాత్మక మార్గంలో ప్రణాళిక రచించి అమలు చేయడమే చిత్రనిర్మాణమంటే.
ప్రొడక్షన్ అంటే – షూటింగ్ లను షెడ్యూల్ చేయడం, నిర్వహించడం, బడ్జెట్ నిర్వహణ , బృందాల మధ్య సమన్వయం, పోస్ట్ ప్రొడక్షన్‌ను పర్యవేక్షించడం.. ఇలా ఎన్నో పనులుంటాయి. ఇవన్నీ తేలికగా, సులువగా జరగాలంటే, సృజనాత్మకతతో పాటు మరిన్ని నైపుణ్యాలు ఉండాలి. సాంకేతిక, వ్యాపార విషయాల పట్ల అవగాహన ఉండాలి. సినిమా నిర్మాణాన్ని తొలి నుంచి తుదివరకు నడిపించే ప్రక్రియపై ఆసక్తి ఉన్న వారికి ఈ కోర్సు ఉపకరిస్తుంది.
ప్రస్తుత డిజిటల్ యుగంతో, కొత్త పుంతలు తొక్కుతున్న సినిమా ప్రొడక్షన్ లో ఎదురయ్యే సవాళ్లను, వాటిని అధిగమించే మార్గాలను తెలుసుకోవడానికి ఈ కోర్సు తగిన విద్యనందిస్తుంది. ఈ కోర్సులో విద్యార్థులు వారి కోసమే రూపొందించిన ప్రత్యేక సమాచారాన్ని, నిర్మాణంలో ప్రతి విభాగంలో, వివిధ రంగాల నిపుణుల అనుభవాలను తెలుసుకోవచ్చు. రామోజీ అకాడమీ ద్వారా అడ్వాన్స్డ్ మీడియా ప్రొడక్షన్ కోర్సుని ఆన్‌లైన్ లో ఉచితంగా పొందవచ్చు.
- ఎడిటింగ్
పరిశ్రమ-ప్రామాణిక పద్ధతులు, అధునాతన సాంకేతికతలను మేళవిస్తూ ఫిల్మ్ ఎడిటింగ్ కోర్స్‌తో నూతన డిజిటల్ యుగంలోకి మీకు స్వాగతం పలుకుతోంది RAM! కాలం చెల్లిన మాన్యువల్ ప్రక్రియల స్థానంలో సరికొత్త డిజిటల్ మెళకువలు అభ్యసించడానికి, కాలంతో పాటు శరవేగంగా మారుతున్న చలనచిత్ర కళ మీద పట్టు సాధించడానికి ఇదే మా ఆహ్వానం. క్లాసికల్ ఫిల్మ్ మేకింగ్ నైపుణ్యంతో పాటు న్యూ-ఏజ్ ఎడిటింగ్ మెళకువలు కూడా నేర్చుకోండి. కేవలం విజువల్స్ ద్వారా ఆకట్టుకునే కథలు చెప్పడం ఎలాగో తెలుసుకోండి. ఈ కోర్స్ ఫిల్మ్ ఎడిటింగ్ ప్రక్రియ గురించి, చలనచిత్ర నిర్మాణ ప్రక్రియలో కాలానుగతంగా పరీక్షించిన విధానాల గురించి సమగ్ర అవగాహనను అందిస్తుంది. ముడి ఫుటేజీని ఆకర్షణీయమైన ఏకీకృత కథనంగా మలచుకునే నైపుణ్యాన్ని ఇప్పుడే మీ సొంతం చేసుకోండి. అత్యంత సృజనాత్మక అంశమైన ఫిల్మ్ ఎడిటింగ్ కళలో రాణించడానికి వెంటనే RAMలో చేరండి.